దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: భానోత్ రవిచందర్


ములుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు, ఉద్యోగాలు తదితర పథకాలు ఇప్పిస్తామని కొందరు దళారులు అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు అర్హత ఆధారంగానే లభిస్తాయని, ఎవరైనా డబ్బులు తీసుకుని పథకాలు లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినా నమ్మవద్దని ప్రజలకు సూచించారు. దళారుల మాయమాటలకు ఆకర్షితులై డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు.

ములుగు జిల్లా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క నిరంతరం కృషి చేస్తున్నారని భానోత్ రవిచందర్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ పథకాలపై అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.

రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో ప్రజలకు ఈ అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
WhatsApp Share

కామెంట్‌లు