ములుగు అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి...
ములుగు: ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని నిధులను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (ఐడీఓసీ)ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ములుగు ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా వనదేవతలు సమ్మక్క–సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
జంపన్నవాగు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం...
ములుగు ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యమున్న జంపన్నవాగును నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, అవసరమైన నిధులను మంజూరు చేస్తామని చెప్పారు.
జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంతో పాటు కోర్టు భవనాలను నిర్మించాలన్న మంత్రి సీతక్క సూచనల మేరకు త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు. మల్లూరు నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి సాగునీరు కీలకం...
ములుగు ప్రాంతంలోని ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారుపేరని సీఎం అన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలంటే సాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలో సమీక్ష నిర్వహించి, అవసరమైన నిధులు మంజూరు చేస్తారని తెలిపారు.
యువతకు విద్య, సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి...
ములుగు ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఏటీసీలతో పాటు భవిష్యత్తులో సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. స్థానిక నిరుద్యోగ యువతకు అవసరమైన శిక్షణ, అవకాశాల కోసం నిధుల కొరత లేకుండా చూస్తామని చెప్పారు.
రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమ దృష్టిని మార్చుకోవాలని సూచించారు.
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు ప్రాధాన్యతనిస్తూ, ఆ తర్వాత విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సీఎం సూచించారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రపంచంతో పోటీపడి రాణించవచ్చని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు.
‘‘అండగా నిలబడండి.. సమస్యలన్నీ పరిష్కరిస్తాం’’...
ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిస్తే వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పాడి, పంటలు సమృద్ధిగా పండేలా చేసి తెలంగాణను సుభిక్షంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి