విధ్వంసం కాదు.. నిర్మాణమే యువత లక్ష్యం కావాలి...
కాకినాడ: యువత మార్పు కోసం పోరాడాలని, అయితే ఆ పోరాటం విధ్వంసం వైపు కాకుండా నిర్మాణం వైపు సాగాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
యువత భారతదేశ భవిష్యత్తు మాత్రమే కాదని, ప్రస్తుత బలమని పవన్ కళ్యాణ్ అన్నారు. సమస్యలను ప్రశ్నించాల్సిందేనని, అయితే ప్రశ్నించే ముందు నిజానిజాలను తెలుసుకోవాలని సూచించారు. డబ్బుకు ఓటును, తప్పుడు సమాచారానికి ఆలోచనను, ద్వేషానికి భవిష్యత్తును అప్పగించవద్దని యువతకు సూచించారు.
సోషల్ మీడియా సమాచారంపై అప్రమత్తత...
సోషల్ మీడియాలో వేగంగా ప్రచారంలోకి వచ్చే ప్రతి సమాచారం నిజం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ విషయాన్నైనా నమ్మే ముందు ఆలోచించాలని, అనుసరించే ముందు ప్రశ్నించాలని, నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను పరిశీలించాలని సూచించారు.
బలమైన ప్రజాస్వామ్యానికి గుడ్డిగా అనుసరించే యువత కాకుండా.. ఆలోచించే, ప్రశ్నించే, సమస్యలకు పరిష్కారాలు సూచించే బాధ్యతాయుతమైన యువత అవసరమని అన్నారు.
దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం...
భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల త్యాగాల స్ఫూర్తితో యువత తమ శక్తిని దేశ నిర్మాణానికి వినియోగించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత మాత్రమే కాకుండా.. అవకాశాలను సృష్టించే యువత అవసరమని అన్నారు. దేశాన్ని విమర్శించడంతో పాటు దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యతను కూడా యువత తీసుకోవాలని సూచించారు.
అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావన...
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
అడవితల్లి బాట పథకం కింద రూ.2,078 కోట్లతో 2,310 కిలోమీటర్ల గిరిజన రహదారులు, రూ.8 వేల కోట్లతో మెగా వాటర్ గ్రిడ్, రూ.9,355 కోట్లతో 6,500 గ్రామాలకు తాగునీరు అందించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. రైతు సంక్షేమం, అటవీ పరిరక్షణ, అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు రూ.1,000 కోట్లతో కీలక అభివృద్ధి పనులు చేపట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
యువత చేతుల్లో దేశ భవిష్యత్తు...
సంక్షేమం ద్వారా ప్రజలకు ప్రస్తుతానికి భరోసా కల్పిస్తూ.. అభివృద్ధి ద్వారా భవిష్యత్తు అవకాశాలను నిర్మిస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.
యువత చేతిలో ఉన్నది కేవలం జాతీయ జ్యోతి మాత్రమే కాదని.. భారతదేశ భవిష్యత్తు కూడా ఉందన్నారు. ఆ భవిష్యత్తును ఆలోచన, ప్రతిభ, కష్టం, నిజాయితీతో మరింత ప్రకాశవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి