చిన్నారికి గడువు ముగిసిన సిరప్ ఇచ్చిన ఘటన.. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిపై ఆరోపణలు
--మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గడువు ముగిసిన సిరప్ ఇవ్వడంపై బాలుడి తండ్రి ఆగ్రహం.
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారికి గడువు ముగిసిన మందు అందించిన ఘటన కలకలం రేపింది. ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళి తన నాలుగేళ్ల కుమారుడు ఎనోస్ రాజ్‌ను వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురికావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
వైద్యులు చిన్నారిని పరీక్షించి రెండు రకాల సిరప్‌లు సూచించారు. అందులో ఒక సిరప్‌ను ఆసుపత్రి ఫార్మసీ నుంచి అందించగా, మరో సిరప్‌ను బయట నుంచి కొనుగోలు చేయాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇంటికి వెళ్లిన తర్వాత చిన్నారికి మందు ఇవ్వడానికి ముందు సిరప్‌పై ఉన్న గడువు తేదీని పరిశీలించగా, అది జూన్ 2026లోనే గడువు ముగిసినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించగా, బాలుడి తండ్రికి సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
"గడువు ముగిసిన మందు ఇస్తే పిల్లాడు చావాలా..?" అంటూ బాలుడి తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గడువు ముగిసిన మందులు ఎలా నిల్వ ఉంచారనే దానిపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే ఈ ఘటనపై ఆసుపత్రి అధికారుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి