29 ఏళ్లకే ఉద్యోగానికి స్వస్తి.. పొలంలోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన యువతి..
పూణే: మంచి ఉద్యోగం, నగర జీవితం, సొంత ఇల్లు.. ఇవే చాలామంది యువత లక్ష్యాలుగా భావిస్తారు. కానీ పూణేకు చెందిన స్నేహా రాజ్‌గురు మాత్రం ఇందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. 29 ఏళ్ల వయసులోనే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రకృతికి దగ్గరగా, వ్యవసాయ ఆధారిత జీవితాన్ని ప్రారంభించారు.
ఉద్యోగంలో కొనసాగుతూ సంపాదన పెంచుకోవడం కంటే తనకు నచ్చిన ప్రశాంతమైన జీవితం ముఖ్యమని భావించిన ఆమె.. వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడే తన భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు. ఈ ప్రయాణానికి సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ఆమె కథ వైరల్‌గా మారింది.
స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఆమె తన పొలంలో పండ్ల చెట్లను పెంచుతున్నారు. భవిష్యత్తులో కుటుంబానికి అవసరమైన ఆహారంలో కొంత భాగాన్ని బయట నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా సొంతంగా పండించుకోవాలనేది ఆమె ఆలోచన.
వ్యవసాయంతో పాటు పొలాన్ని ఆహ్లాదకరమైన ప్రదేశంగా మార్చేందుకు పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ప్రకృతి మధ్య గడపడం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని ఆమె చెబుతున్నారు.
యువతకు భిన్నమైన సందేశం
కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేయడమే తన లక్ష్యం కాదని, ఒత్తిడితో కూడిన జీవనశైలికి బదులుగా తనకు సంతృప్తినిచ్చే జీవితాన్ని ఎంచుకున్నానని స్నేహా చెబుతున్నారు.
రిటైర్మెంట్ అనేది కేవలం వయసుతో ముడిపడిన విషయం కాదని.. మన జీవన విధానాన్ని మనకు నచ్చిన విధంగా మార్చుకోవడం కూడా ఒక రకమైన స్వేచ్ఛేనని ఆమె అభిప్రాయపడుతున్నారు.
ఆమె ఎంచుకున్న జీవన విధానం సోషల్ మీడియాలో పలువురిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నగర జీవితం, ఉద్యోగ ఒత్తిళ్లతో విసిగిపోయిన యువతలో ఈ కథనం చర్చనీయాంశంగా మారింది.