గీసుగొండలో నగదు చోరీ.. నిందితుడి అరెస్ట్...

వరంగల్, ఆగస్టు 27: జాన్‌పాక్‌లోని పెట్రోల్ బంక్ వద్ద డీసీఎం వాహనంలో నుంచి రూ.1.50 లక్షల నగదు చోరీ చేసిన కేసులో గీసుగొండ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.20,000 నగదు, శామ్‌సంగ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గొర్రెకుంటకు చెందిన తాంటికంటి భాస్కర్ బెల్ బ్రాండ్ కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 21న డ్రైవర్ కుళ్ల సునీల్, హెల్పర్ యాద గణేష్‌తో కలిసి డీసీఎం వాహనంలో స్వీట్లు, బేకరీ ఉత్పత్తుల విక్రయాల కోసం విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు వెళ్లారు. విక్రయాల అనంతరం కలెక్షన్ నగదుతో తిరిగి వస్తుండగా 23న సాయంత్రం జాన్‌పాక్‌లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కోసం వాహనాన్ని నిలిపారు.

భాస్కర్ నగదు ఉన్న బ్యాగ్‌కు తాళం వేసి సీటు వెనుక ఉంచి బిల్లు తీసుకునేందుకు కిందకు దిగారు. ఆ సమయంలో హెల్పర్ గణేష్ క్యాబిన్‌లోనే ఉన్నాడు. బిల్లు తీసుకుని తిరిగి వచ్చే సరికి గణేష్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన భాస్కర్ నగదు బ్యాగ్‌ను పరిశీలించారు. బ్యాగ్ కిందివైపు కోసి ఉండటాన్ని గుర్తించారు. అందులోని రూ.1.50 లక్షల నగదు కనిపించకపోవడంతో గణేష్‌పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గీసుగొండ పోలీసులు దర్యాప్తు చేపట్టి యాద గణేష్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.20,000 నగదు, ఒక శామ్‌సంగ్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి గతంలోనూ ఓ దొంగతనం కేసులో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...