మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి : సీతక్క


ఏటూరునాగారం, సెప్టెంబర్ 3: మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తులను సద్వినియోగం చేసుకొని గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని అన్నారు.

ఏటూరునాగారం మండల కేంద్రంలోని ట్రెజరీ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన దుస్తులు, జూట్ బ్యాగుల తయారీ యూనిట్లను ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలకు బ్యాంకుల అనుసంధానంతో వడ్డీలేని రుణాలు అందిస్తూ స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. కుట్టు శిక్షణ పొందిన మహిళలు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఇతరులకు కూడా ఉపాధి కల్పించవచ్చని తెలిపారు.

మహిళల ఉపాధి కోసం రూ.10 లక్షలతో ఆధునిక యంత్రాలను సమకూర్చినట్లు చెప్పారు. ములుగు నియోజకవర్గంలో ప్రైవేటు సంస్థల సహకారంతో సుమారు 2,000 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలకు వివిధ శాఖల ద్వారా కుట్టు యంత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా నియోజకవర్గానికి 1,000 కుట్టు యంత్రాలు అందించనున్నట్లు తెలిపారు. గిరిజన మహిళలకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా కుట్టు యంత్రాలు అందించేందుకు ముఖ్యమంత్రిని కోరనున్నట్లు పేర్కొన్నారు.

పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్‌వాడీలకు అవసరమైన ఏకరూప దుస్తుల కుట్టు పనులను మహిళలకు అప్పగించడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.

అటవీ ప్రాంతాల్లో లభించే ఇప్పపువ్వు, తేనె, విస్తరాకుల వంటి వనరులను ఆధారంగా చేసుకొని స్థానికంగానే ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అటవీ ఉత్పత్తులతో ఏయే వస్తువులు తయారు చేయవచ్చనే అంశంపై అధ్యయనం చేసి, స్థానిక వనరుల ఆధారంగా ఉపాధి అవకాశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో పదిమంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఏటూరునాగారం మండల పరిధిలోని 1,219 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపికైన 11 ఉత్తమ పాఠశాలలకు అవార్డులను ఆయా ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఇన్‌చార్జి ఏపీఓ ప్రతాప్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జనార్ధన్, ఆత్మ కమిటీ చైర్మన్ రఘు, డివిజన్ చైర్మన్ రవీందర్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...