మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్...


హనుమకొండ, సెప్టెంబర్ 29: హనుమకొండ బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడుతున్న ఓ యువకుడిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కీసర ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు గతంలోనూ రద్దీగా ఉండే బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల మొబైల్ ఫోన్లు, నగదు చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో సెప్టెంబర్ 28న హైదరాబాద్ నుంచి బస్సులో హనుమకొండకు వచ్చిన యువకుడు.. ఉదయం సుమారు 8 గంటల సమయంలో బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికుడి ప్యాంట్ జేబులోని మొబైల్ ఫోన్‌ను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

సెప్టెంబర్ 29న మళ్లీ హనుమకొండ బస్‌స్టేషన్‌కు వచ్చి ప్రయాణికుల వద్ద మొబైల్ ఫోన్లు లేదా నగదు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అతని కదలికలను గుర్తించారు. పోలీసులను గమనించి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

నిందితుడిపై గతంలో ఉప్పల్, నల్గొండ టూ టౌన్, చేవెళ్ల, ఆర్పీఎస్ వరంగల్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మొత్తం ఆరు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రజలకు పోలీసుల సూచన :

బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో మొబైల్ ఫోన్లు, నగదు, ఇతర విలువైన వస్తువుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...