రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు..
-- ప్రమాద ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన వరంగల్ సీపీ ఎన్. శ్వేత.
వరంగల్, సెప్టెంబర్ 29: రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను సమగ్రంగా చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై 14 ప్రాంతాలు, వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై 8 ప్రాంతాలను ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలుగా గుర్తించి సీపీ ఎన్. శ్వేత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
అధికారిక లెక్కల ప్రకారం గత మూడేళ్లలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై 108 రోడ్డు ప్రమాదాలు జరగగా 80 మంది మృతి చెందారు. వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై 79 ప్రమాదాలు జరగగా 37 మంది మృతి చెందారు.
ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లో అవసరమైన రోడ్డు భద్రతా చర్యలను తక్షణమే చేపట్టాలని సీపీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను గుర్తించి, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ పరిశీలనలో NHAI, R&B, మున్సిపల్, రవాణా, ఎక్సైజ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
