విద్యుత్ డిమాండ్ పెరగడంతోనే రూ.5,420 కోట్ల ట్రూ-అప్ భారం..!


హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరగడం, వర్షాభావ పరిస్థితులతో జల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల అదనపు విద్యుత్‌ కొనుగోళ్లపై వ్యయం పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ వినియోగదారుల నుంచి రూ.5,420.23 కోట్ల ట్రూ-అప్‌ మొత్తాన్ని వసూలు చేయనున్న నిర్ణయంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా రాష్ట్ర విద్యుత్‌ పరిస్థితిపై వివరాలు వెల్లడించారు. గతంలో రాష్ట్ర గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ సుమారు 15,000 మెగావాట్లుగా ఉండగా, ప్రస్తుతం అది దాదాపు 20,000 మెగావాట్లకు చేరిందని తెలిపారు.

తగ్గిన జల విద్యుత్‌ ఉత్పత్తి

వర్షాభావ పరిస్థితుల కారణంగా నదులు, రిజర్వాయర్లలో నీటి లభ్యత తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో జల విద్యుత్‌ ఉత్పత్తిలో దాదాపు 4,000 మెగావాట్ల లోటు ఏర్పడిందని తెలిపింది. ఈ కొరతను భర్తీ చేసేందుకు థర్మల్‌ విద్యుత్‌పై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చిందని వివరించింది.

రాత్రి సమయంలో విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉండటంతో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి, ఇతర మార్గాల్లో విద్యుత్‌ కొనుగోళ్ల అవసరం మరింత పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది.

హైదరాబాద్‌లోనూ భారీ డిమాండ్‌

విద్యుత్‌ వినియోగం హైదరాబాద్‌లో కూడా గణనీయంగా పెరిగింది. నగరంలో గరిష్ఠ డిమాండ్‌ 4,072 మెగావాట్లకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. TGSPDCL పరిధిలో 12,044 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. వ్యవసాయ పంపుసెట్లు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూలింగ్‌ పరికరాల వినియోగం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది.

నవంబర్‌ నుంచి అదనపు ఛార్జీ

ఇదిలా ఉండగా, తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (TGERC) 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన మొత్తం రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్‌ మొత్తాన్ని నిర్ణయించింది. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. మిగిలిన రూ.5,420.23 కోట్లను ఇతర కేటగిరీల విద్యుత్‌ వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు.

ఈ వసూళ్లు నవంబర్‌ 2026 విద్యుత్‌ బిల్లుల నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి నెలలో యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాతి నెలల్లో యూనిట్‌కు 50 పైసల చొప్పున ట్రూ-అప్‌ ఛార్జీ విధించనున్నారు.

TGSPDCL పరిధిలో 29 బిల్లింగ్‌ నెలలు, TGNPDCL పరిధిలో 26 బిల్లింగ్‌ నెలల్లో ఈ మొత్తాన్ని వసూలు చేయనున్నారు. బిల్లులో ట్రూ-అప్‌ ఛార్జీని ప్రత్యేకంగా చూపించాలని TGERC ఆదేశించింది.

ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. జల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గినా థర్మల్‌ విద్యుత్‌ ద్వారా డిమాండ్‌ను భర్తీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...