జయహో టీమ్ ఇండియా.. ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌పై భారత్‌కు స్వర్ణం..


హైదరాబాద్, అక్టోబర్ 3: జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్‌లో టీమ్ ఇండియా స్వర్ణ పతకం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ స్వర్ణాన్ని భారత్ నిలబెట్టుకుంది.

భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 61 పరుగులతో దూకుడైన ఇన్నింగ్స్ ఆడగా, తెలంగాణకు చెందిన తిలక్ వర్మ 22 బంతుల్లో అజేయంగా 51 పరుగులు సాధించాడు. శివమ్ దూబే 27 పరుగులతో కీలక సహకారం అందించాడు.

212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది. పాకిస్థాన్ బ్యాటర్ హసన్ నవాజ్ 96 పరుగులతో పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ విజయాన్ని ఖరారు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

టీమ్ ఇండియా విజయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌పై ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకున్న భారత జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ స్వర్ణ పతకం దేశానికి గౌరవం, కీర్తిని తీసుకువచ్చిందని పేర్కొంటూ భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత విజయాల చరిత్రలో ఈ విజయం మరో చిరస్మరణీయ అధ్యాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అభిషేక్ శర్మ 61 పరుగులు, తెలంగాణ స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ అజేయంగా సాధించిన 51 పరుగుల ఇన్నింగ్స్‌ను ముఖ్యమంత్రి ప్రశంసించారు. అలాగే కీలక సమయాల్లో బౌలింగ్‌తో రాణించిన అక్షర్ పటేల్ సహా భారత ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తిని అభినందించారు.

ఆసియా క్రీడల్లో వివిధ క్రీడాంశాల్లో పట్టుదల, అంకితభావం, క్రీడాస్ఫూర్తితో పోటీపడి పతకాలు సాధించిన భారత క్రీడాకారులందరికీ ముఖ్యమంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...