వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం: ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్ పూర్తిగా దహనం...
వరంగల్: నగరంలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలోని 14వ డివిజన్‌లో ఉన్న ఒక ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుమాముల మార్కెట్ యాడ్‌కు దగ్గర్లో, ఉన్న 'సాయి ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్' లో ఈ ప్రమాదం జరిగింది. గోడౌన్‌లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు, స్క్రాప్ మెటీరియల్ నిల్వ ఉండటంతో మంటలు క్షణాల వ్యవధిలోనే ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేయడంతో చుట్టుపక్కల కాలనీల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పలు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్ లోపల ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు మరియు ఆస్తి నష్టం వివరాలపై దర్యాప్తు ప్రారంభించారు.
