‘వైటీడీ’ పేరుతో వెబ్‌సైట్.. స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులకు లీగల్ నోటీసులు


స్వర్ణగిరి దేవాలయం

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పేరుతో పోలికలు ఉన్న వెబ్‌సైట్ల వ్యవహారంపై ఆలయ అధికారులు చర్యలకు దిగారు. భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వాహకులకు యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ‘వైటీడీ’ (YTD – Yadagirigutta Temple Development) పేరుతో గెజిట్ జారీ చేసిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘వైటీడీ’ పేరును ఉపయోగిస్తూ స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులు ytdtemple.com పేరుతో వెబ్‌సైట్ నిర్వహిస్తున్నారని గుర్తించినట్లు తెలిపారు.

ఇప్పటికే స్వర్ణగిరి ఆలయానికి ప్రత్యేక అధికారిక వెబ్‌సైట్ అందుబాటులో ఉన్నప్పటికీ, మరో వెబ్‌సైట్‌ను ప్రారంభించడంతో పాటు యాదగిరిగుట్ట దేవస్థానాన్ని పోలిన చిత్రాలను ఉపయోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

‘వైటీడీ’ పేరుతో నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌ను నిలిపివేయాలని నోటీసుల్లో సూచించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వెబ్‌సైట్ కొనసాగిస్తే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం.

యాదగిరిగుట్ట దేవస్థానం పేరును లేదా అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే మరికొన్ని వెబ్‌సైట్ల నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.

అధికారిక వెబ్‌సైట్ ఇదే

భక్తులు యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించిన దర్శనం, సేవలు, ఇతర ఆన్‌లైన్ సేవల కోసం yadagiriguttatemple.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలని ఆలయ అధికారులు సూచించారు. అనధికారిక వెబ్‌సైట్ల ద్వారా బుకింగ్‌లు లేదా చెల్లింపులు చేసే ముందు వెబ్‌సైట్ చిరునామాను పరిశీలించాలని కోరారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...