ఢిల్లీలో నిరసనకారులపై చర్యలు దుర్మార్గం: మాస్ లైన్ నాయకులు
నర్సంపేట: ఢిల్లీలో నిరసన తెలుపుతున్న వారిపై లాఠీచార్జి చేయడాన్ని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నర్సంపేట కార్యదర్శి అడ్డూరి రాజు, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకుడు కోడి సోమన్న ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా నర్సంపేట మాస్ లైన్ ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అక్రమ పద్ధతుల్లో 13 కోట్ల మంది భారతీయుల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని, విద్యార్థులు, యువకులు, మేధావులు, సుప్రీంకోర్టు న్యాయవాదులను అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
ఢిల్లీలో కేంద్ర బలగాలను మోహరించడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని వారు వ్యాఖ్యానించారు. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని, ఢిల్లీలో విధించిన ఆంక్షలను తొలగించాలని, రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు చెబుతున్న సుమారు 50 వేల మందిని బేషరతుగా విడుదల చేయాలని కోరారు.
శాంతియుత నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తే ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ నాయకులు దార లింగయ్య, భానోత్ జవహర్ లాల్, ఎండీ ఖలీల్, రాజేందర్, శేఖర్, రమేష్, రఫీ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
