హైదరాబాద్‌లో సారస్ మేళా ప్రారంభించిన మంత్రి సీతక్క
-- మహిళా సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడమే లక్ష్యం
హైదరాబాద్: గ్రామీణ మహిళల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించి, వారిని వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన సారస్ గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ మేళాను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీతక్క సందర్శించారు. మహిళలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత ఉత్పత్తులు, సంప్రదాయ కళారూపాలు, ఆహార పదార్థాలు, పచ్చళ్లు, చిరుతిళ్లు, చిరుధాన్యాల ఉత్పత్తులను పరిశీలించి వాటి తయారీ, ధరలు, విక్రయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు తయారు చేసిన వంటకాలను రుచి చూశారు.
మహిళలు పొదుపు సంఘాల సభ్యులుగా మాత్రమే కాకుండా, ఉత్పత్తిదారులుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఇందుకోసం అవసరమైన శిక్షణ, ఆర్థిక సహకారం, మార్కెటింగ్ సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. ఉత్పత్తుల నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్‌పై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
సారస్ వంటి మేళాల ద్వారా గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించి మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేసి ప్రోత్సహించాలని కోరారు.
మేళాలో చిన్నారులు, కళాకారులు ప్రదర్శించిన డప్పు, కోయ నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, సెర్ప్ డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

