కీసరగుట్టలో అనుమానాస్పద తవ్వకాలు.. పురాతన నిర్మాణాల వద్ద ఆనవాళ్లు

హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ప్రముఖ కీసరగుట్ట పరిసరాల్లో అనుమానాస్పద తవ్వకాలు వెలుగులోకి వచ్చాయి. సన్యాసి మఠం, ఆలయ పరిసరాల్లోని పురాతన రాతి నిర్మాణాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేసినట్లు స్థానికులు గుర్తించారు.

మఠం, ఆలయం వెనుక భాగంలో ఉన్న పాత రాతి కట్టడాల లోపలి మట్టిని కొన్ని అడుగుల మేర తొలగించిన ఆనవాళ్లు కనిపించాయి. పురాతన రాళ్లను కూడా పెకిలించినట్లు సమాచారం. తవ్వకాలు జరిగిన ప్రాంతంలో కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించడంతో పూజలు నిర్వహించినట్లు స్థానికులు గుర్తించారు. ఘటనపై స్థానికులు, ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

గతంలోనూ పురావస్తు పరిశోధనలు

కీసరగుట్ట ప్రాంతంలో గతంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశోధనలు, తవ్వకాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రాచీన తెలుగు శాసనం, పంచలోహ జైన తీర్థంకర విగ్రహాలు, విష్ణుకుండినుల కాలానికి చెందిన కోట గోడలు, ఇటుక నిర్మాణాలు, బౌద్ధ–జైన సంప్రదాయాలకు సంబంధించిన నిర్మాణాలు, రాతితో రూపొందించిన నీటి తొట్టెలు వంటి చారిత్రక అవశేషాలు బయటపడినట్లు నమోదైంది.

చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతం

కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. కీసర ప్రాంతం విష్ణుకుండినుల కాలంతో పాటు తదనంతర రాజవంశాల నిర్మాణ ఆనవాళ్లకు కేంద్రంగా ఉన్నట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. బౌద్ధ, జైన సంప్రదాయాలకు సంబంధించిన అవశేషాలు కూడా ఈ ప్రాంతంలో గుర్తించబడ్డాయి.

పురాతన నిర్మాణాల వద్ద జరిగిన తవ్వకాల వెనుక గుప్త నిధుల అన్వేషణే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ విషయంపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. చారిత్రక అవశేషాలకు నష్టం కలగకుండా సంబంధిత అధికారులు ఘటనపై పరిశీలన చేపట్టాల్సిన అవసరం ఉంది.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...