పిల్లల సైబర్ భద్రతకు ప్రభుత్వం పూర్తి సహకారం: సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్: పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాల బారిన పడకుండా వారి భద్రత, సంరక్షణ కోసం న్యాయ సేవల ప్రాధికార సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. డిజిటల్ వేదికలపై పిల్లల రక్షణకు సంబంధించిన కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.

జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (NALSA) ఆధ్వర్యంలో “డిజిటల్ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం: ఆన్‌లైన్ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం” అనే అంశంపై దక్షిణాది ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

మహిళలు, పిల్లల రక్షణకు ప్రత్యేక వ్యవస్థలు

మహిళలు, పిల్లల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీసులు, భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.

భరోసా కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు ఒకేచోట పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

పోలీసు శాఖలోని విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో SHE-భరోసా సైబర్ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని, CybHER యాప్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.

విద్యార్థులనే సైబర్ అంబాసిడర్లుగా..

విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా తయారు చేసి వారి తోటి విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పిల్లల రక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

పిల్లలకు అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం కల్పించడం వంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. TGSLSA, పాఠశాల విద్యాశాఖతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుందని, ఉపాధ్యాయులు పిల్లలకు వారి చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.

ఇప్పటివరకు 3,000 మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

1930, 1098 నంబర్లు గుర్తుంచుకోవాలి

సైబర్ నేరాల బారిన పడకుండా చేపడుతున్న కార్యక్రమాల్లో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930, పిల్లల సహాయం కోసం 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్లను పిల్లలు, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని చెప్పారు.

పిల్లలు సైబర్ నేరాల బారిన పడినప్పుడు వారిని తప్పుబట్టకుండా అర్థం చేసుకుని, మద్దతు ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

“బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడమే నిజమైన న్యాయం”

న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష పడటం మాత్రమే కాదని ముఖ్యమంత్రి అన్నారు. బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడం, గౌరవాన్ని పునరుద్ధరించడం కూడా న్యాయంలో భాగమేనని చెప్పారు. ముఖ్యంగా పిల్లలు కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయం అని పేర్కొన్నారు.

NALSA ఆధ్వర్యంలోని దక్షిణాది ప్రాంతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషకరమని అన్నారు. పిల్లల సైబర్ భద్రత వంటి కీలక అంశంపై సదస్సు నిర్వహిస్తున్నందుకు NALSA, న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయ సేవల ప్రాధికార సంస్థల కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు.

మొబైల్ లోక్ అదాలత్ వాహనాలు ప్రారంభం..


న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవల కోసం సిద్ధం చేసిన మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్, న్యాయమూర్తుల సమక్షంలో ప్రారంభించారు.

ఈ సదస్సులో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, న్యాయ సేవల సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...