రామప్ప సమీపంలో బొగ్గు గని ప్రతిపాదనపై కేటీఆర్ అభ్యంతరం...
వెంకటాపూర్ ప్రాంతంలో ప్రతిపాదించిన పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుపై ఇప్పటికే వారసత్వ పరిరక్షణ వర్గాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మైనింగ్‌లో భాగంగా భారీ స్థాయిలో తవ్వకాలు, బ్లాస్టింగ్ చేపడితే రామప్ప ఆలయం, చెరువు పరిసరాలపై ప్రభావం ఉండొచ్చని వారు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టును వెంటనే వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ కోరారు. ప్రతిపాదన కొనసాగితే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.
మైనింగ్‌తో రామప్పకు ముప్పు లేదన్న సింగరేణి
మరోవైపు రామప్ప దేవాలయానికి మైనింగ్ కార్యకలాపాలతో ముప్పు ఉంటుందన్న ప్రచారంలో వాస్తవం లేదని సింగరేణి స్పష్టం చేసింది. వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనాలు, నిపుణుల నివేదికలను పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ఆలయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని, పురావస్తు శాఖతో పాటు సంబంధిత నిపుణుల సూచనలు, చట్టపరమైన నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటామని సింగరేణి పేర్కొంది.
