మాజీ CBI డైరెక్టర్ ఎం. నాగేశ్వర్ రావు రాజకీయాల్లోకి.. సర్వజన సనాతన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక

వారణాసి: మాజీ CBI డైరెక్టర్ ఎం. నాగేశ్వర్ రావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. వారణాసిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన సర్వజన సనాతన పార్టీ (SSP) జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యవర్గం ఆయనను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు సమాచారం.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు భద్రత, శాంతిభద్రతలు, పరిపాలన రంగాల్లో పనిచేసిన అనుభవంతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు నాగేశ్వర్ రావు తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే పరిపాలనా సంస్కరణలతో పాటు, భారత నాగరికతకు సంబంధించిన మూలాలను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

నాలుగు ప్రధాన అంశాలపై పార్టీ దృష్టి..

సర్వజన సనాతన పార్టీ తన దృష్టిని ప్రధానంగా విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, నాగరికతతో అనుసంధానం అనే నాలుగు అంశాలపై కేంద్రీకరించినట్లు నాగేశ్వర్ రావు వివరించారు.
ఆధునిక, ప్రపంచస్థాయి విద్యతో పాటు భారత చరిత్ర, నాగరికత, జ్ఞాన సంప్రదాయాలపై అవగాహన కల్పించడం తమ విద్యా విధానంలో భాగమని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్యం అందించడంతో పాటు యువత, రైతులు, చేతివృత్తిదారులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు.
భారతీయ భాషలు, కళలు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, పండుగలు, జ్ఞాన సంప్రదాయాలు, కుటుంబం, సాంస్కృతిక సంస్థలను దేశ బలంగా చూడాలని పార్టీ పేర్కొంటోంది.
'ఆధునిక భారత్.. నాగరికత మూలాలతో'
గతానికి తిరిగి వెళ్లడం తమ లక్ష్యం కాదని, నాగరికత మూలాలను ఆధారంగా చేసుకుని ఆధునిక భారతదేశాన్ని నిర్మించడమే లక్ష్యం అని నాగేశ్వర్ రావు తెలిపారు. సనాతనాన్ని కేవలం ఎన్నికల అంశంగా కాకుండా విద్య, ఆరోగ్యం, ఉపాధి, పాలన, సంస్కృతి, సామాజిక జీవనంలో ప్రతిబింబించే విలువలుగా చూడాలని ఆయన పేర్కొన్నారు.
ఏ కులం లేదా సమాజానికి వ్యతిరేకంగా తమ పార్టీ పనిచేయదని, సామాజిక విభజనలకు దూరంగా అందరి కోసం పనిచేయడమే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు.

కాశీ నుంచి రాజకీయ ప్రస్థానం..

కాశీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు నాగేశ్వర్ రావు వెల్లడించారు. భారత నాగరికతకు కాశీ ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఎం. నాగేశ్వర్ రావు తెలంగాణలోని వరంగల్ ప్రాంతానికి చెందినవారని, కెమిస్ట్రీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 1986 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారిగా సేవలందించారని హిందుస్తాన్ టైమ్స్ నివేదించింది. అనంతరం వివిధ హోదాల్లో పనిచేసి CBI తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...