TRSMA అవార్డ్స్-2026
-- 4 వేల మంది నుంచి ప్రతిభ చూపిన 30 మందికి అవార్డులు..
హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ప్రతిభను గుర్తిస్తూ ‘టీచర్స్ అప్రిషియేషన్ అవార్డ్స్–2026’ అందజేశారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ స్టేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (TRSMA), భారతి ఎయిర్‌టెల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి (CPD) కార్యక్రమంలో భాగంగా ఈ పురస్కారాలను అందించారు.
జూన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో TRSMAకు అనుబంధంగా ఉన్న పాఠశాలలకు చెందిన సుమారు 4,000 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల భాగస్వామ్యం, కోర్సుల పూర్తి, కృత్రిమ మేధ (AI) ఆధారిత వనరుల వినియోగం వంటి అంశాల ఆధారంగా ప్రతిభను అంచనా వేశారు.
మూడు విభాగాల్లో టాప్-10 చొప్పున మొత్తం 30 మంది ఉపాధ్యాయులను పురస్కారాలకు ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని కార్డినల్ గ్రేషియస్ హైస్కూల్‌కు చెందిన జి. శైలజ మూడు విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో నిలిచారు.
కార్యక్రమానికి ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె. లింగయ్య, SCERT డైరెక్టర్ జి. రమేశ్, ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఎం. సోమి రెడ్డి హాజరయ్యారు.
సాంకేతికత, కృత్రిమ మేధ, విద్యార్థుల అభ్యసన అవసరాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు తమ జ్ఞానం, బోధనా నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని TRSMA అధ్యక్షుడు ఎస్. మధుసూదన్ పేర్కొన్నారు.