మహిళా ఎమ్మెల్యేలతో పోలీస్ లు అనుచితంగా వ్యవహరించారని ఆరోపణలు..వారిని గుర్తించాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు...
హైదరాబాద్, సెప్టెంబర్ 29: అసెంబ్లీ వద్ద జరిగిన నిరసన సందర్భంగా మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అనుచితంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను గుర్తించాలని తెలంగాణ హైకోర్టు డీజీపీ సీవీ ఆనంద్ను ఆదేశించింది.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు అసెంబ్లీ గేటు వద్ద జరిగిన నిరసన సందర్భంగా కొంతమంది పోలీసులు తమతో అనుచితంగా వ్యవహరించారని మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను గుర్తించాలని డీజీపీని ఆదేశించినట్లు బీఆర్ఎస్ న్యాయ బృందం తెలిపింది.
అసెంబ్లీ పరిధిలో స్పీకర్ ఆదేశాల మేరకు పోలీసులు వ్యవహరించి ఉంటే ఆ అంశం స్పీకర్ అధికార పరిధిలోకి వస్తుందని కోర్టు పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం.
అదే సమయంలో మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలపై సంబంధిత అధికారులను గుర్తించి వివరాలను సమర్పించాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. ఘటన అసెంబ్లీ ప్రాంగణం వెలుపల జరిగి ఉంటే తదుపరి వివరాలను కోర్టుకు సమర్పించాలని సూచించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ వ్యవహారంపై తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు ఆంధ్రజ్యోతి నివేదించింది.
