విదేశాల్లో ఉద్యోగం పేరిట మోసం.. నిందితుడి అరెస్ట్...

-- వాట్సాప్‌ ద్వారా నకిలీ ఉద్యోగ ఆఫర్‌ లేఖలు..బాధితుల డబ్బులను బెట్టింగ్‌లో పెట్టినట్లు పోలీసుల వెల్లడి..

వరంగల్: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నకిలీ ఆఫర్‌ లెటర్లు, వాట్సాప్‌ చాటింగ్‌, వాయిస్‌ మెసేజ్‌ల ద్వారా మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని వరంగల్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పర్వతగిరి స్టేషన్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జఫర్‌గడ్‌ మండలం తిమ్మంపేటకు చెందిన మార్క శివకుమార్‌ (28) గతంలో పలు ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేశాడు. ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడినట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

గతంలో తనతో కలిసి పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం యూకేలో ఉన్నట్లు తెలుసుకున్న శివకుమార్‌.. విదేశాల్లో ఉద్యోగం ఇప్పించే అవకాశం ఉందని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. లండన్‌లోని ఓ టెక్నాలజీ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ వాట్సాప్‌ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు. ఉద్యోగ ప్రాసెసింగ్‌, వీసా, స్పాన్సర్‌షిప్‌, ఇతర ఖర్చుల పేరుతో పలు దఫాలుగా బాధితుల వద్దనుండి డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. వేర్వేరు సిమ్‌ కార్డులు ఉపయోగించి HR మేనేజర్‌, మేనేజర్‌, ఫైనాన్స్‌ మేనేజర్‌ పేర్లతో తానే వాట్సాప్‌ చాటింగ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే టెక్స్ట్‌ను వాయిస్‌గా మార్చే అప్లికేషన్‌ ఉపయోగించి సంబంధిత వ్యక్తుల పేరుతో వాయిస్‌ మెసేజ్‌లు పంపినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. నకిలీ ఉద్యోగ ఆఫర్‌ లెటర్‌, జాయినింగ్‌ లెటర్‌లను రూపొందించి బాధితుడికి పంపినట్లు పోలీసులు తెలిపారు.

బాధితుడి నుంచి వివిధ బ్యాంకు ఖాతాలు, యూపీఐ మార్గాల ద్వారా సుమారు రూ.26 లక్షలు బదిలీ చేయించుకున్నట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అదనంగా ఇతర ఖాతాలు, బెట్టింగ్‌ యాప్‌కు సంబంధించిన మార్గాల ద్వారా సుమారు రూ.57 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో కోల్పోయినట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఇదే క్రమంలో మరో యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, ఈ వ్యవహారంపై మరో పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. గతంలోనూ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న కేసు నమోదైందని పేర్కొన్నారు.

బాధితుడు మోసాన్ని గుర్తించి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో, నిందితుడు సెప్టెంబర్‌ 11న బాధితుడి గ్రామానికి వెళ్లి రూ.50 వేల నగదు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన డబ్బు తిరిగి ఇస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు.

నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొబైల్‌ ఫోన్లలో ఉన్న వాట్సాప్‌ ఖాతాలు, ఈమెయిల్‌ వివరాలు, బెట్టింగ్‌ యాప్‌ సంబంధిత సమాచారం, ఇతర డిజిటల్‌ ఆధారాలను పరిశీలించి వాటి వివరాలను భద్రపరిచినట్లు పేర్కొన్నారు.

కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

ఢిల్లీలో నిరసనకారులపై చర్యలు దుర్మార్గం: మాస్ లైన్ నాయకులు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు