ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించిన సీఎం..


న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు హాజరు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ఈ సదస్సులో భాగంగా జరిగే డిఫెన్స్‌ ఎక్స్‌పో–2026ను ప్రారంభించాలని కోరారు.

ఢిల్లీలో పలువురు ఎంపీలతో కలిసి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం సమావేశమై రక్షణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. డిఫెన్స్‌ ఎక్స్‌పోలో ఏరోస్పేస్‌, రక్షణ, అంతరిక్ష రంగాలపై ప్రత్యేక సదస్సుతో పాటు ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం వివరించారు.

ఎయిర్‌షోకు అవసరమైన గగనతల అనుమతులతో పాటు భారత వైమానిక దళ విమానాలు, సూర్యకిరణ్‌, సారంగ్‌ ఏరోబాటిక్‌ బృందాలు పాల్గొనేలా సహకరించాలని కోరారు. హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, ఎండీఎల్‌ వంటి రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, డీఆర్‌డీవో ప్రయోగశాలలు ఎక్స్‌పోలో పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించేలా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ చేపట్టిందని సీఎం తెలిపారు. రక్షణ శాఖ కోరిన 1,500 ఎకరాల్లో మిగిలిన 750 ఎకరాలను కూడా సేకరించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ అంగీకరించినట్లు సీఎం తెలిపారు. మొత్తం భూమికి సంవత్సరానికి రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 ఏళ్లకు భూమిని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

సమావేశంలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, సురేష్ కుమార్ షెట్కార్, పోరిక బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

ఢిల్లీలో నిరసనకారులపై చర్యలు దుర్మార్గం: మాస్ లైన్ నాయకులు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు