తుమ్మిడిహట్టి బ్యారేజీకి త్వరగా అనుమతులు ఇప్పించాలి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
ఢిల్లీ, సెప్టెంబర్ 29: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చొరవ తీసుకుని అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్లు తెలిపారు.
మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించిన పలు నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎఫ్ఆర్ఎల్ +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఈ స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉంటుందని, తద్వారా నీటి తరలింపునకు అవసరమయ్యే విద్యుత్ వినియోగం, వ్యయం తగ్గుతుందని వివరించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS), డిండి ఎత్తిపోతల పథకం (DLIS), సీతారామ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు (SSMP), గౌరవెల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. అనుమతుల జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతోందని తెలిపారు.
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (CWC) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే CWCకి సమర్పించినట్లు తెలిపారు. నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం పొందేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) పరిధిలో చేపడుతున్న టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని సీఎం కోరారు. తొలి దశ టెలీమెట్రీ ఏర్పాటుకు అవసరమైన రూ.4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసినట్లు తెలిపారు. తొలి దశతో పాటు రెండో, మూడో దశలకు సంబంధించిన టెలీమెట్రీ యంత్రాలను కూడా త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
