లింగాల కేదారి కుటుంబానికి రూ.10 లక్షల సాయం..
హన్మకొండ: తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు, ఉద్యమకారులకు ఉచితంగా భోజనం అందించిన హన్మకొండకు చెందిన లింగాల కేదారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ప్రకటించిన ఆర్థిక సాయం చెక్కును శనివారం కుటుంబ సభ్యులకు అందజేశారు.
హన్మకొండలో లింగాల కేదారి నిర్వహించిన భోజన హోటల్ తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించడంతో స్థానికంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సుమారు రూ.50కే భోజనం అందించేవారని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగిన 2012–2013 కాలంలో విద్యార్థులు, ఉద్యమకారులకు కేదారి తన హోటల్ ద్వారా ఉచితంగా భోజనం అందించేవారని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. ఉద్యమంలో పాల్గొంటున్న వారికి తన వంతు సహకారం అందిస్తూ ఆయన సేవలందించారని పేర్కొన్నారు.
అయితే గత నెల 9వ తేదీన ప్రమాదవశాత్తు లింగాల కేదారి, ఆయన భార్య మృతి చెందారు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో కేదారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును హన్మకొండలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు కేదారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కేదారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పృధ్వీరాజ్, ఆకాష్ రాజ్, MRO గుజ్జుల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.