తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగులకు రెండు డీఏలు, కరువుపై ప్రత్యేక కార్యాచరణ..


హైదరాబాద్, అక్టోబర్ 2: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు మంజూరు చేయడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లు, విద్యుత్ సరఫరా, సాగునీటి ప్రాజెక్టులు, డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్ పాలసీ తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది.

ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు

2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండు డీఏలను మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మంజూరు చేయాలని నిర్ణయించింది.

బకాయి మొత్తాలను విడతల వారీగా చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల ఆర్థిక భారం పడనుంది.

ఎల్‌నినో.. 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు

రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు, వర్షపాతం లోటుపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ వానాకాలంలో సుమారు 17 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంది.

కరువు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన తక్షణ ఉపశమన చర్యలపై కేబినెట్ సబ్‌కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశంపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.

కరువు మండలాల ప్రకటనతో పాటు రాష్ట్రానికి తగిన సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం మంత్రుల బృందం త్వరలో ఢిల్లీకి వెళ్లనుంది.

65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది.

ఈ సీజన్‌లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది.

19,892 మెగావాట్లకు విద్యుత్ పీక్ డిమాండ్

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. సాధారణంగా రోజువారీ విద్యుత్ వినియోగం సుమారు 15,000 మెగావాట్లుగా ఉండగా.. ఈ సీజన్‌లో పీక్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరింది.

గత ఏడాది నమోదైన గరిష్ఠ డిమాండ్ 16,613 మెగావాట్లుగా ఉంది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

7,800 మెగావాట్ల కొత్త విద్యుత్ సామర్థ్యం

భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 7,800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇందులో:

- 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్
- 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్
- 800 మెగావాట్ల పవన విద్యుత్

ప్రాజెక్టులను కేంద్ర నిబంధనలకు అనుగుణంగా బిడ్డింగ్ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది.

కోహెడలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనులను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఈ మార్కెట్‌ను ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులపై నిర్ణయం

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పునఃసమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈపీసీ విధానంలో చేపట్టి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ఇందులో భాగంగా 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ

తెలంగాణలో డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ అమలు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్ర పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణ భవన్‌లో అదనపు అధికారుల నియామకం

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టును ఏర్పాటు చేయడంతో పాటు మరో నలుగురు గ్రూప్-1 అధికారులను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పనిచేసేందుకు నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు వెల్లడించారు.

కేబినెట్ నిర్ణయాల్లో ముఖ్యాంశాలు..

రెండు డీఏలు – కరువు పరిస్థితులు – 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు – 19,892 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ – 7,800 మెగావాట్ల కొత్త విద్యుత్ సామర్థ్యం – కోహెడ ఫ్రూట్ మార్కెట్ – 10 ఈపీసీ ప్రాజెక్టులపై చర్యలు – డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్ పాలసీ – తెలంగాణ భవన్‌లో అధికారుల నియామకాలు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

ఢిల్లీలో నిరసనకారులపై చర్యలు దుర్మార్గం: మాస్ లైన్ నాయకులు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు