వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు..
హైదరాబాద్: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బండ్లగూడలోని ఫాతిమా కాలేజీలో అక్టోబర్ 2న జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సియాసత్, ఇతర వార్తా సంస్థలు వెల్లడించాయి.
‘‘నాకు వయసు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. ప్రస్తుతం పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు. నేను పోటీ చేయను’’ అని అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నట్లు సమాచారం.
విద్య, రాజకీయ ప్రస్థానంపై వ్యాఖ్యలు
ఈ సందర్భంగా తన విద్యాభ్యాసం, రాజకీయ ప్రస్థానం గురించి కూడా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. కాలేజీలో చదవకపోయినా ప్రజాజీవితంలో ఒక స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా తనకు స్పందించాల్సిన స్థాయికి రాజకీయంగా ఎదిగానని ఆయన పేర్కొన్నారు.
అక్బరుద్దీన్ ఒవైసీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోతే, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తదుపరి అభ్యర్థి ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే, తాను ఎన్నికల్లో పోటీ చేయబోననే విషయంపై ఆయన నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
