వాట్సాప్లో ‘నో’ అని చెప్పినా ముప్పేనా? సైబర్ మోసాలపై సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద బ్యాంకు లావాదేవీల సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు నమ్మించే మెసేజెస్ పంపించి, ఆ లావాదేవీ చేయకపోతే ‘నో’ (NO) అని రిప్లై ఇవ్వాలని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపుతున్నట్లు తెలిపారు. ఇలాంటి సందేశాల వెనుక ఉన్న మోసపూరిత ఉద్దేశాలను గుర్తించలేకపోతే వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ తరహా మోసాల కారణంగా ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఖాతా నుంచి రూ.లక్ష కోల్పోయిన ఘటనను కూడా ప్రస్తావించారు.
గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలకు స్పందించకుండా, బ్యాంకు అధికారిక యాప్ లేదా కస్టమర్ కేర్ ద్వారా లావాదేవీలను నిర్ధారించుకోవాలని సూచించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని లేదా cybercrime.gov.in వెబ్సైట్ను ఆశ్రయించాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ మోసాలను అడ్డుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.
